Sourthwest Monsoon: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు
- రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలంగా పరిస్థితులు
- రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు రుతుపవనాలు
- ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం
మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు నాలుగు రోజుల్లో అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను ఇవి తాకుతాయని పేర్కొంది.
మరోవైపు, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.