Ajinkya rahane: నాలుగో రోజు మొదటి గంట మాకు కీలకం..: రహానే
- టెస్ట్ ఛాంపియన్ షిప్ మూడో రోజు రహానే వేలికి గాయం
- అయినా ఇబ్బంది లేదన్న అజింక్య రహానే
- బౌలింగ్ మెరుగ్గా చేశామన్న అభిప్రాయం
ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలో, మూడో రోజు గురువారం టీమిండియా కీలక ఆటగాడు అజింక్య రహానే చేతి వేలికి గాయం అయింది. భారత్ తొలి ఇన్సింగ్స్ లో 89 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన రహానే గాయపడడంతో అభిమానుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో రహానే తన వేలి గాయంపై స్పందించాడు.
‘‘ఇది (వేలికి గాయం) నా బ్యాటింగ్ ను (రెండో ఇన్నింగ్స్ లో) ప్రభావితం చేస్తుందని అనుకోవడం లేదు’’ అని స్టార్ స్పోర్ట్స్ తో రహానే చెప్పాడు. తొలి ఇన్సింగ్స్ లో తన ఆటపైనా స్పందించాడు. ‘‘నేను బ్యాటింగ్ చేసిన తీరు పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ రోజు బాగా జరిగింది. మేము 320 -330 స్కోరు సాధిస్తామని అనుకున్నాం. అయినాకానీ మెరుగైన పనితీరే చూపించాం. బౌలింగ్ పరంగా చూస్తే.. మెరుగ్గా బౌలింగ్ చేశాం. అందరూ ఫామ్ లోకి వచ్చారు" అన్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో రహానే అవుటవ్వడంలో కామెరాన్ గ్రీన్ పట్టిన క్యాచ్ కీలకంగా పనిచేసింది. దాన్ని నిజంగా మంచి క్యాచ్ గా రహానే అభివర్ణించాడు. అతడొక మంచి ఫీల్డర్ అని తమకు తెలుసన్నాడు. ‘‘ఆస్ట్రేలియా కాస్త మొగ్గుతో ఉంది. రేపటి రోజు మొదటి గంట మాకు చాలా కీలకం’’ అని రహానే పేర్కొన్నాడు. గురువారం సెషన్ ముగింపునకు ముందు జడేజా ఆస్ట్రేలియా వైపు రెండు కీలక వికెట్లను పడగొట్టడం తెలిసిందే. ఆస్ట్రేలియా 296 పరుగుల లీడ్ తో ఉంది. 350 పరుగులకు ఆసీస్ ను కట్టడి చేస్తే, భారత బ్యాట్స్ మెన్ రాణిస్తే గెలుపునకు అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆస్ట్రేలియా స్కోరు 450కు వెళితే టీమిండియాకు గెలుపు అవకాశాలు కష్టంగా మారతాయి.