Wrestlers: కేంద్రానికి రెజ్లర్ల అల్టిమేటం!
- తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆసియా గేమ్స్ ను బహిష్కరిస్తామన్న రెజ్లర్లు
- తాము మానసికంగా అనుభవిస్తున్న బాధలను అర్థం చేసుకోలేరంటూ ఆవేదన
- ఈ వివాదంపై రాజీ చేసుకోవాలని తమపై చాలా ఒత్తిడి ఉందని వెల్లడి
- బ్రిజ్ భూషణ్ మనుషులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారన్న సాక్షి మాలిక్
కేంద్ర ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆసియా గేమ్స్ ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హర్యానాలోని సోనిపట్ లో మహాపంచాయత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. ‘‘సమస్యలను పరిష్కరిస్తేనే మేం ఆసియా గేమ్స్ లో పాల్గొంటాం. ప్రతి రోజూ మానసికంగా మేం అనుభవిస్తున్న బాధలను మీరు అర్థం చేసుకోలేరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమలో ఐక్యత లోపించిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. బజరంగ్, వినేశ్ ఫొగట్, తాను.. కలిసే ఉన్నామని స్పష్టం చేసింది.
‘‘బ్రిజ్ భూషణ్ పై చేసిన ఆరోపణల విషయంలో ఒత్తిడి వల్లే బాలిక (మైనర్ రెజ్లర్) తన మాట మార్చింది. రాజీ చేసుకోవాలంటూ మా మీద చాలా ఒత్తిడి ఉంది. బ్రిజ్ భూషణ్ మనుషులు మాకు ఫోన్లు చేసి, బెదిరింపులకు దిగుతున్నారు’’ అని వాపోయింది. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకుండా.. నిష్పాక్షిక దర్యాప్తు అనేది సాధ్యం కాదని చెప్పింది.