KTR: కేసీఆర్ ప్రజలను కలవకపోవడంపై కేటీఆర్ ఏం చెప్పారంటే..!
- ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే సమస్య తనదాకా వస్తుందని కేసీఆర్ చెప్పారన్న కేటీఆర్
- తెలంగాణలో సంస్కరణలు తీసుకు వచ్చి, పాలనను ప్రజల వద్దకు చేర్చారన్న మంత్రి
- ఎవరిస్థాయిలో వారు పని చేస్తే సీఎం వరకు రావాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలవడం లేదని, ప్రజా దర్బార్ నిర్వహించడం లేదని విపక్షాలు విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే సమస్య తన దాకా వస్తుందని కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. అందుకే రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకు వచ్చి, పాలనను ప్రజల వద్దకు చేర్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ నుండి మొదలు కిందిస్థాయిలో పని చేసే ఉద్యోగి వరకు ఆరు లక్షల మందికి పైగా పని చేస్తున్నారని చెప్పారు. పెన్షన్, రేషన్ కార్డు, నల్లా, పాస్ బుక్.. ఇలా ఏదైనా సమస్య వస్తే వ్యవస్థలో లోపం ఉన్నట్లుగా భావించవచ్చునని చెప్పారు.
ప్రభుత్వ యంత్రాంగం సామాన్యులకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. వారితో నెరవేరని సమస్యలు, జటిలమైనవి ఉంటే సీఎం వరకు రావాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎవరి స్థాయిలో ఎవరి పనిని వారు సరిగ్గా చేస్తే సీఎం వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. దేశంలోనే తెలంగాణ ఈ-గవర్నెన్స్ లో ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు.