JP Nadda: మోదీ వచ్చి శంకుస్థాపన చేసినా ఏపీ రాజధాని ముందుకు కదల్లేదు: జేపీ నడ్డా
- శ్రీకాళహస్తి బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగం
- ఏపీలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని ఆరోపణలు
- శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని విమర్శలు
- ఏపీకి మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారన్న నడ్డా
తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేసినా రాజధాని ముందుకు కదల్లేదని విచారం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందికి గురిచేశారని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడంలేదని నడ్డా ఆరోపించారు. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు.
ప్రధాని మోదీ ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని, దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు ఆయన మొగ్గుచూపారని నడ్డా వివరించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను మోదీ బాధ్యతాయుత రాజకీయాల వైపు మళ్లించారని పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారని నడ్డా వెల్లడించారు.
మోదీ ప్రధాని అయ్యే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని, ఇప్పుడు దేశంలో విద్యుత్ లేని గ్రామమే కనిపించదని తెలిపారు. ఇవాళ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందుతోందని వివరించారు.
దేశంలోని 50 కోట్ల మందికి మోదీ సర్కారు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోందని నడ్డా చెప్పారు. ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80 వేల కోట్లు ఖర్చుచేసిందని అన్నారు. ఉజ్వల పథకం కింద 9 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్టు వివరించారు.