Roja: మంత్రి రోజాకు అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక
- శుక్రవారం చెన్నైలోని తన నివాసంలో అనారోగ్యానికి గురైన ఏపీ మంత్రి రోజా
- కాలి వాపు, నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిక
- ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
- త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వెల్లడి
- రోజా త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు
ఏపీ పర్యాటక శాఖ మంత్రి, వైసీపీ నేత రోజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాలినొప్పి, వాపుతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని థౌజెండ్ లైట్స్లోగల అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. శుక్రవారం ఆర్ధరాత్రి మంత్రి అనారోగ్యానికి గురికాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మంత్రి చెన్నైలోని తన ఇంట్లో కుటుంబసభ్యులతో గడిపారు. ఈ క్రమంలో రోజాకు అకస్మాత్తుగా కాలు నొప్పి, వాపు రావడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాలివాపు తగ్గిందని, త్వరలో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే, రోజా అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు లోనయ్యారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలిసి హర్షం వ్యక్తం చేశారు. రోజా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.