Boland: బోలాండ్ ఫైర్... ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
- డబ్ల్యూటీసీ ఫైనల్ కు నేడు చివరి రోజు
- ఆట ఆరంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ
- ఒకే ఓవర్లో కోహ్లీ, జడేజాలను అవుట్ చేసిన బోలాండ్
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఐదో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 164-3 స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాను ఆస్ట్రేలియా మీడియం పేసర్ స్కాట్ బోలాండ్ దెబ్బతీశాడు. బోలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో టీమిండియా గెలుపు అవకాశాలపై ప్రభావం పడింది.
మొదట విరాట్ కోహ్లీని ఓ అవుట్ స్వింగర్ తో అవుట్ చేసిన బోలాండ్... అదే ఓవర్లో రవీంద్ర జడేజాను డకౌట్ చేశాడు. 49 పరుగులు చేసిన కోహ్లీ... ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని డ్రైవ్ చేయబోయి స్లిప్స్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఎంతో వేగంగా వచ్చిన బంతిని స్మిత్ షార్ప్ గా క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత జడేజా కూడా ఆఫ్ స్టంప్ ఏరియాలో పడిన బంతిని ఆడబోయి వికెట్ కీపర్ కేరీ చేతికి చిక్కాడు.
ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు 50 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు. క్రీజులో రహానే (31 బ్యాటింగ్), కేఎస్ భరత్ (6 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 257 పరుగులు అవసరం... ఆసీస్ గెలవాలంటే మరో 5 వికెట్లు పడగొడితే చాలు.