Rohit Sharma: ఆసీస్ చేతిలో పరాభవంపై రోహిత్ శర్మ స్పందన
- డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి
- 209 పరుగుల తేడాతో ఆసీస్ విన్
- టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం మంచి నిర్ణయమే అనుకున్నామని రోహిత్ వెల్లడి
- కానీ ఆసీస్ బ్యాట్స్ మెన్ బాగా ఆడారని కితాబు
డబ్ల్యూటీసీ ఫైనల్లో కీలకమైన టాస్ గెలిచి కూడా ఆసీస్ చేతిలో ఓటమిపాలవడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టాస్ గెలిచి ఆసీస్ ను బ్యాటింగ్ కు దింపడం మంచి నిర్ణయమే అనుకున్నామని వెల్లడించాడు. అందుకు తగ్గట్టుగానే తొలి సెషన్ లో తమ బౌలర్లు ఆకట్టుకునేలా బౌలింగ్ చేశారని, కానీ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ తమ అద్భుత ఆటతీరుతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశారని రోహిత్ శర్మ వివరించాడు.
ఓ టెస్టులో వెనుకబడిన సమయంలో పుంజుకోవడం ఎప్పుడూ కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ తాము గట్టి పోరాటం చేశామని, చివరివరకు మంచి ప్రదర్శన కనబరిచామని వెల్లడించాడు.
ఈ నాలుగేళ్ల కాలంలో తాము కఠోరంగా కృషి చేశామని, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండుసార్లు ఫైనల్స్ చేరడం నిజానికి గొప్ప ఘనతగానే భావిస్తామని తెలిపాడు. టీమిండియా ఇక్కడి వరకు రావడానికి పడిన శ్రమను ఎవరూ తక్కువ చేసి చూపలేరని పేర్కొన్నాడు.
జట్టు మొత్తం పోరాట పటిమ చూపిందని, దురదృష్టవశాత్తు మ్యాచ్ గెలవలేకపోయినా, తలెత్తుకునే ఉంటామని, ఇకపైనా ఇదే పోరాట పంథా కొనసాగుతుందని హిట్ మ్యాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ప్రతి సమయంలోనూ వెన్నంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని వెల్లడించాడు.
లండన్ లోని ఓవల్ మైదానంలో ఆసీస్ తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడం బెడిసికొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన ఆసీస్.... ఆ ఒత్తిడిని టీమిండియాపై చివరి రోజు వరకు కొనసాగించింది.
టీమిండియా ఓటమిపై కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా స్పందించాడు. ఈ పిచ్ అసలు 469 పరుగులు సాధించదగిన ట్రాక్ కాదని, కానీ ఆసీస్ జట్టు బ్యాట్స్ మెన్ అండతో పైచేయి సాధించిందని వివరించాడు. తొలిరోజు పిచ్ పై పచ్చిక, ఆకాశం మేఘావృతం కావడంతో బౌలింగ్ ఎంచుకున్నామని టాస్ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.