Amit Shah: సిగ్గుగా అనిపించడం లేదా అని జగన్ ను అడుగుతున్నా: అమిత్ షా
- సీఎం జగన్ పై అమిత్ షా విమర్శనాస్త్రాలు
- గత నాలుగేళ్లుగా ఏపీ పాలన అవినీతిమయం అన్న అమిత్ షా
- రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని వెల్లడి
- ఏపీకి రూ.5 లక్షల కోట్లు ఇచ్చాం... అభివృద్ధి ఎక్కడ అంటూ ప్రశ్నించిన వైనం
ఏపీ రాజకీయాలపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. వైసీపీ, బీజేపీ నేతల మాటల యుద్ధంలో తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా కూడా రంగప్రవేశం చేశారు. మోదీ 9 ఏళ్ల పాలనపై ఈ సాయంత్రం విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరయ్యారు. సీఎం జగన్ పాలనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత నాలుగేళ్లుగా ఏపీలో పాలన అంతా కుంభకోణాలు, అవినీతిమయమేనని విమర్శించారు. విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా వెల్లడించారు. ఆ అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తోందా? ఆ డబ్బంతా ఎటు వెళ్లింది? అని ప్రశ్నించారు.
"తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని జగన్ చెప్పుకుంటున్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో మాత్రం ఏపీ 3వ స్థానంలో ఉంది. సిగ్గుగా అనిపించడంలేదా? అని జగన్ ను అడుగుతున్నా. రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం తలదించుకోవాలి. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యంపైనా జగన్ ఫొటోలు వేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలో 20 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవాలి. 300 సీట్లతో మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం" అని అమిత్ షా పేర్కొన్నారు.