Vallabhaneni Vamsi: విలన్లు ఎంతో మంది ఉన్నా హీరో ఒక్కడే ఉంటాడు.. జగన్ కూడా అంతే: వల్లభనేని వంశీ
- జగన్ ఒంటరిగానే యుద్ధం చేస్తాడన్న వల్లభనేని
- చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శ
- తన నియోజకవర్గంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని వెల్లడి
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ స్వరం మారుతోంది. మొన్నటి వరకు బీజేపీని ఒక్క మాట కూడా అనని వైసీపీ నేతలు ఒక్కసారిగా బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వల్లభనేని వంశీ ఈ పొత్తులపై మాట్లాడుతూ... సినిమాల్లో విలన్లు ఎంతో మంది ఉంటారని, హీరో మాత్రం ఒక్కడే ఉంటాడని... ముఖ్యమంత్రి జగన్ కూడా అంతేనని చెప్పారు. జగన్ ఒంటరిగానే యుద్ధం చేస్తారని అన్నారు.
చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని, అలాంటి వాళ్లు జగన్ ను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిని సమాధులతో చంద్రబాబు పోల్చడంపై మండిపడ్డారు. చంద్రబాబు కూడా కాటికి కాలు చాపారని... అలాంటి వ్యక్తికి శ్మశానమే గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. జగన్ ను విమర్శించేవాళ్లంతా పనికిమాలిన సన్నాసులని అన్నారు. తన నియోజకవర్గంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని... వాటిలో చాలా మంది ఇళ్లు కట్టుకుని, గృహప్రవేశాలు కూడా చేశారని చెప్పారు.