Mumbai: బిపర్‌జోయ్ తుపాను ఎఫెక్ట్.. ముంబై విమానాశ్రయంలో గందరగోళం
- ముంబైలో భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు
- పలు విమానాల రద్దు.. మరికొన్ని ఆలస్యం
- మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
అతి తీవ్ర తుపానుగా మారిన ‘బిపర్‌జోయ్’ ప్రభావం ముంబై విమానాశ్రయంపైనా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీస్తుండంతో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తామెక్కాల్సిన విమానం ఉందో, లేదో, ఉంటే ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక వందలాది మంది ప్రయాణికులు ఆందోళనలో మునిగిపోయారు.
చాలా వరకు విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యమయ్యాయి. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో కొన్ని విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానాశ్రయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ప్రయాణికులు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ పరిస్థితుల కారణంగా రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారని, దీంతో కొన్ని విమానాలను ఆలస్యంగా నడపనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఇండిగో కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు అర్ధం చేసుకుని సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు, మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.