YouTube channels: రెండేళ్లలో 150 యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం
- దేశానికి వ్యతిరేకంగా వార్తలను ప్రసారంచేస్తున్న వెబ్ సైట్లు
- దేశభద్రతకు ముప్పుగా మారడంతో కఠిన నిర్ణయం
- నిఘా వర్గాల సహకారంతో నిషేధం అమలు చేస్తున్న ప్రభుత్వం
దేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తూ, దేశ భద్రతకు ముప్పుగా మారిన యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వేటు వేస్తూనే ఉంది. 2021 నుంచి ఇప్పటి వరకు.. తప్పుడు వార్తలు, దుష్ప్రచారం చేస్తున్న 150 యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ సైట్లను బ్యాన్ చేసింది. నిఘా వర్గాల సహకారం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఛానళ్లు, వెబ్ సైట్ల జాబితాలో ఉన్నవన్నీ దాదాపుగా మన దేశంపై దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది. గత 2 సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో భారత వ్యతిరేక కంటెంట్ ప్రోత్సహిస్తున్నట్లుగా మంత్రిత్వ శాఖ గుర్తించింది. అధికారిక సమాచారం ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ ఉల్లంఘన కారణంగా ఈ వెబ్‌సైట్‌లు, ఛానళ్లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ లిస్ట్ లో ఖబర్ విత్ ఫ్యాక్ట్స్, ఖబర్ తైజ్, ఇన్ఫర్మేషన్ హబ్, ఫ్లాష్ నౌ, మేరా పాకిస్తాన్, హకిఖత్‌కి దునియా, అప్నీ దునియా తదితర యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ సైట్లు ఉన్నాయి.