Vidya kanuka: విద్యాకానుక కిట్ ను రిలీజ్ చేసిన ఏపీ సీఎం జగన్
- పల్నాడు జిల్లా క్రోసూరులో బహిరంగ సభలో ప్రసంగం
- రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కిట్ల పంపిణీ
- పిల్లల మేనమామగా విద్యాకానుక అందిస్తున్నట్లు వెల్లడి
'ఓటు హక్కులేని చిన్న పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నది గత ప్రభుత్వ ఆలోచన.. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఈ చిన్నారుల మేనమామ ప్రభుత్వమే. అందుకే ఓ మేనమామగా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకు ఖర్చుకు వెనకాడకుండా పాటుపడుతున్నట్లు' ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు విద్యాకానుక కిట్ల పంపిణీ పండుగలా జరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఈ పండుగలో పాల్గొంటున్నారని వివరించారు. వరుసగా నాలుగో ఏడాది విద్యాకానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యాకానుక అందిస్తున్నామని జగన్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు.
ఈ కిట్లలోనూ మెరుగైన మార్పులు చేశామని వివరించారు. స్కూలు బ్యాగు సైజు పెంచామని, యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశామని పేర్కొన్నారు. ఈ ఒక్క పథకంపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.3,366 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్యా సదుపాయాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. నాడూ నేడూ కార్యక్రమం చేపట్టామని, డిజిటల్ విద్యను ప్రతీ విద్యార్థికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
విద్యాకానుక కిట్లలో ఏమున్నాయంటే..
3 జతల యూనిఫామ్
స్కూల్ బ్యాగ్
షూస్, సాక్సులు
నోట్ బుక్స్, వర్క్ బుక్స్
బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీ