WorldCup 2023: వరల్డ్ కప్ 2023: ఉప్పల్ లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడదట!
- నేడు ఖరారు కానున్న మ్యాచ్ ల షెడ్యూల్
- చెన్నైలో ఇండియా-పాక్ మధ్య మ్యాచ్
- ఈఎస్ పీఎన్ వెబ్ సైట్ కథనంలో వెల్లడి
- డ్రాఫ్ట్ షెడ్యూల్ విడుదల చేసిన ఈఎస్ పీఎన్
ఈ ఏడాది మనదేశంలో వన్డే వరల్డ్ కప్-2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ లో మొదలు కానున్న ఈ మెగా టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ ఈ రోజు (సోమవారం) ఖరారు చేయనుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ను ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ ఈఎస్ పీఎన్ తాజాగా వెల్లడించింది. ఈ వెబ్ సైట్ అంచనా ప్రకారం.. ఈ మెగా టోర్నీకి సంబంధించి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా జరిగే అవకాశం లేదు.
వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ మ్యాచ్ ల కోసం ఐసీసీ మొత్తం 8 వేదికలను ఖరారు చేసినట్లు ఈఎస్ పీఎన్ వెల్లడించింది. చెన్నై, ఢిల్లీ, పూణె, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్ కతా, బెంగళూరులలో గ్రూప్ మ్యాచ్ లు జరగనున్నట్లు తెలిపింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న చెన్నై వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించాలని భావించినా భద్రతా కారణాలతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ వేదికను చైన్నైకి మార్చినట్లు సమాచారం.
అయితే, ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలనే తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల కోరిక తీరేలా కనిపించడం లేదు. ప్రపంచ కప్ మ్యాచ్ ల కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన వేదికలలో హైదరాబాద్ కూడా ఉంది.. అయితే, ఇక్కడ భారత జట్టు ఆడే అవకాశాలు లేవని ఈఎస్ పీఎన్ డ్రాఫ్ట్ షెడ్యూల్ వెల్లడించింది. ఈ మైదానంలో విదేశీ జట్లు లీగ్ దశలో తలపడనున్నాయి.