stray dogs: కామారెడ్డి జిల్లాలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
- బాలుడికి తీవ్ర గాయాలవడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు
- చికిత్స అందిస్తున్న వైద్యులు
- గాంధారి మండలం ముదెల్లిలో ఘటన
ఫంక్షన్ హాల్ ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి అరుపులు విని చుట్టుపక్కల వారు కుక్కలను తరిమికొట్టారు. గాయపడ్డ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుందీ దారుణం. తీవ్ర గాయాలపాలైన బాలుడు ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.
జిల్లాలోని గాంధారి మండలంల ముదెల్లిలో మూడేళ్ల బాలుడు రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. ఇంతలో చుట్టుపక్కల తిరుగుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. కుక్కలు మీద పడడంతో బాలుడి పొట్టభాగంలో, తలపైనా గాయాలు అయ్యాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకొచ్చి కుక్కలను తరిమికొట్టారు. అనంతరం బాలుడుని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల వారు వేగంగా స్పందించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.