italy: ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోనీ కన్నుమూత
- కొన్ని రోజులుగా లూకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ
- ఇటలీకి నాలుగుసార్లు ప్రధానిగా పని చేసిన ఘనత
- అత్యధిక కాలం పాలించిన నేతగా గుర్తింపు
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా లూకేమియాతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇటలీకి ఆయన నాలుగుసార్లు ప్రధానిగా పని చేశారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా గుర్తింపు పొందారు. ఇటలీలో ప్రస్తుతం మూడో సంపన్న వ్యక్తిగా ఉన్నారు. స్థానికంగా తిరుగులేని మీడియా అధినేతగా ఎదిగారు. అయితే, ఆయన జీవితం అనేక వివాదాస్పద అంశాలతో ముడిపడి ఉంది. విలాసాలు, లైంగిక ఆరోపణలు, అవినీతి కేసులు ఎదుర్కొన్నారు.
బెర్లుస్కోనీ మిలాన్ నగరంలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన అంతకుముందు క్రూజ్ షిప్ లో గాయకుడిగా ఉన్నారు. నిర్మాణ రంగం, మీడియా రంగంలో ప్రవేశించి అత్యంత ధనికుడిగా ఎదిగారు. 1994లో ఫోర్జా ఇటాలియా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది మొదటిసారి ప్రధానిగా అధికారం చేపట్టారు.