Manchu Manoj: అనాథ పిల్లలకు 'ఆదిపురుష్' సినిమా టికెట్లు ఇస్తున్న మంచు మనోజ్ దంపతులు
- అనాథ పిల్లల కోసం 2500 టికెట్ల బుక్
- ఈ నెల 16న విడుదల కానున్న చిత్రం
- క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం వినూత్న ఆలోచన చేసింది. సినిమా ప్రదర్శితం అయ్యే ప్రతీ షోలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచాలని, కొన్ని టికెట్లను రామాలయాలకు, పేద చిన్నారులకు ఇవ్వాలని నిర్ణయించింది. వారికి బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నిరుపేద పిల్లల కోసం 10వేల టికెట్లను బుక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పదివేల టికెట్లు బుక్ చేసి పేదలకు పంచుతామని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా కూడా పదివేల టికెట్లు బుక్ చేసుకున్నారు.
శ్రేయాస్ మీడియా ఖమ్మం జిల్లాలోని 1103 గ్రామాలలో ఒక్కో రామాలయానికి 101 టికెట్లు బుక్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం సుమారు లక్ష పైచిలుకు టికెట్లను బుక్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా చేరారు. ఆదిపురుష్ 2500 టికెట్లను బుక్ చేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న అనాథ పిల్లలకు చూపించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంచు మనోజ్–మౌనిక దంపతుల నుంచి ప్రకటన వచ్చింది. కృతీ సనన్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించిన ఆదిపురుష్ సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించారు. విదేశాల్లోనూ ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్రభాస్ యూఎస్‌ఏ వెళ్లినట్టు తెలుస్తోంది.