Annamalai: అన్నామలై వ్యాఖ్యల ఫలితం.. బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య పొత్తు బ్రేక్ అయ్యే అవకాశం!
- జయలలిత అక్రమాస్తుల అంశాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అన్నామలై
- ఆమె జైలుకు కూడా వెళ్లారని వ్యాఖ్య
- అన్నామలైను హద్దుల్లో ఉంచకపోతే.. పొత్తుపై పునరాలోచిస్తామన్న అన్నాడీఎంకే
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకే తమిళ ప్రజల మద్దతు ఉంటుంది. జాతీయ పార్టీలు ఎంత ప్రయత్నించినా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూడా డీఎంకేకు మిత్రపక్షంగానే ఉంటోంది. మరోవైపు జయలలిత చనిపోయిన తర్వాత నుంచి అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పని చేస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య బంధాన్ని చెడగొట్టే పరిస్థితిని తీసుకొచ్చాయి.
వాస్తవానికి అన్నామలై అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకేతో కూడా టచ్ లోనే ఉన్నారు. అయితే ఇటీవల ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేతలకు ఆగ్రహం తెప్పించాయి. జయలలిత అక్రమాస్తుల అంశం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేతో పొత్తు గురించి అన్నామలై మాట్లాడుతూ... బీజేపీతో జయలలిత కేవలం సన్నిహిత సంబంధాల వరకే పరిమితమయ్యారని, పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. ద్రవిడ రాజకీయాల్లో ఉత్తరాది పార్టీ అయిన బీజేపీ సెట్ కాదని ఆమె భావించేవారని చెప్పారు. జయలలిత హయాంలో విపరీతమైన అవినీతి జరిగిందని, అక్రమాస్తుల కేసులో జయ జైలుకు కూడా వెళ్లారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, రాష్ట్ర రాజకీయాలకు అన్నామలై పనికిరారని అన్నారు. అన్నామలై ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. అన్నాడీఎంకేతో పొత్తు వద్దని అన్నామలై అనుకుంటున్నారని తాము భావిస్తున్నామని చెప్పారు.
అన్నామలైను హద్దుల్లో ఉంచకపోతే బీజేపీతో పొత్తుపై తాము పునరాలోచించుకోవాల్సి వస్తుందని జయకుమార్ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ - అన్నాడీఎంకే కూటమికి ఒక్క సీటు కూడా రాకూడదని అన్నామలై భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవినీతిపై వచ్చిన ఆరోపణలపై అన్నామలై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. తమిళనాడులో బీజేపీకి నాలుగు అసెంబ్లీ సీట్లు తమ పార్టీ వల్లే వచ్చాయని చెప్పారు. తమ పార్టీతో పొత్తులో ఉంటేనే రాష్ట్రంలో బీజేపీకి గుర్తింపు ఉంటుందని అన్నారు. పొత్తు ధర్మాన్ని అన్నామలై పాటించాలని... లేకపోతే పొత్తుపై తాము మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.