YS Sunitha: ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ... సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన సునీత
- వైఎస్ వివేకా హత్య విషయం జగన్ కు ముందే తెలుసన్న సునీత
- ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ఎంపీకి మద్దతుగా వ్యవహరిస్తోందని ఆరోపణ
- సీబీఐ దర్యాప్తుకు అవినాశ్ రెడ్డి సహకరించడంలేదని వివరణ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అవినాశ్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ వైఎస్ వివేక కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించగా.. తన పిటిషన్ పై సునీత స్వయంగా వాదనలు వినిపించారు. సీనియర్ల లాయర్ల వాదనలను వినబోమని వెకేషన్ బెంచ్ చెప్పడం వల్ల తన కేసును తానే వాదించుకున్నారు. సునీతకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను కోర్టు అనుమతించింది.
ఈ కేసులో సీబీఐ విచారణలో సేకరించిన పలు సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సునీత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా పలు అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు.
వివేకా హత్య గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ముందే తెలుసని సునీత ఆరోపించారు. ఈ కేసులో సునీత వాదనలు వినిపిస్తూ.. ‘‘సీబీఐ సేకరించిన సాక్ష్యాలు సహా అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్ రెడ్డి సీబీఐ దర్యాప్తునకు సహకరించడం లేదు. నోటీసులకు స్పందించడంలేదు. విచారణకు హాజరుకావడం లేదు. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపిస్తూ అరెస్టును తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ఎంపీకి సహకరిస్తోంది. అధికార పార్టీలోని కీలక వ్యక్తులు అవినాశ్ కు అండగా ఉన్నారు. ప్రభుత్వ పెద్దల అండతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు’’ అని సుప్రీంకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.