Prathap C Reddy: 90 ఏళ్ల వయసు.. రూ.20 వేల కోట్ల సంపద.. రోజూ ఆఫీస్ కు వెళ్లాల్సిందే!

This 90 year old with net worth Rs 20000 crore still goes to office 6 days a week
  • ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ సీ రెడ్డి 
  • ఆయన నెట్ వర్త్ రూ.20వేల కోట్ల పైమాటే
  • అయినా వారంలో ఆరు రోజులు పని చేయాల్సిందే
మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గురించే. సాధారణంగా 60 ఏళ్ల వయసులో ఎక్కువ మంది రిటైర్మెంట్ తీసుకుని, హాయిగా కాలక్షేపం చేస్తుంటారు. వీలుంటే తీర్థయాత్రలు చేస్తుంటారు. మనసుకు నచ్చిన హాబీలతో గడుపుతుంటారు. కానీ, వీరందరికీ ప్రతాప్ రెడ్డి భిన్నం. చేసే పని నుంచి ఆయన ఇప్పటికీ రిటైర్మెంట్ తీసుకోలేదు. ఇష్టం ఉన్న చోట కష్టం తెలియదని, వయసు కూడా అడ్డు కాదని నిరూపిస్తున్నారు.

అపోలో హాస్పిటల్స్ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. 90 ఏళ్ల వయసులోనూ ప్రతాప్ రెడ్డి ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ఆఫీస్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తారు. వారంలో ఆరు రోజుల పాటు ఆయన దినచర్య ఇదే. అందరి మాదిరే వారంలో ఒక్క రోజే ఆయన కూడా సెలవు తీసుకుంటారు. వైద్య సేవల్లో ప్రతాప్ రెడ్డికి 50 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 50 ఏళ్ల వయసులో హాస్పిటల్ వ్యాపారంలోకి ఆయన అడుగు పెట్టారు. 40 ఏళ్లుగా అదే వ్యాపారంలో కొనసాగుతూ.. అపోలో హాస్పిటల్స్ ను భారత్ లోనే అతిపెద్ద వైద్య సేవల సంస్థగా తీర్చిదిద్దారు. దేశంలో తొలి హాస్పిటల్స్ చైన్ ను నెలకొల్పిన వ్యక్తిగా ఆయన చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. 

స్వతహాగా ప్రతాప్ సీ రెడ్డి కార్డియాలజిస్ట్. 1933 ఫిబ్రవరి 5న చిత్తూరు జిల్లా తవణం పల్లె మండలం అరగొండలో ఆయన జన్మించారు. ఫోర్బ్స్ టాప్-100 భారతీయ సంపన్నుల్లో ప్రతాప్ రెడ్డి ఒకరు. చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో ఆయన వైద్యవిద్య చదివారు. వైద్య రంగంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. అపోలో హాస్పిటల్స్ కేవలం వైద్య సేవల్లోనే కాకుండా, ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్ తదితర వాటిల్లోకి విస్తరించేలా చర్యలు తీసుకున్నారు. 

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ను ఇప్పుడు ప్రతాప్ సీ రెడ్డి నలుగురు కుమార్తెలు ప్రీతా రెడ్డి, సునీతారెడ్డి, శోభన కామినేని, సంగీతారెడ్డి నిర్వహిస్తున్నారు. ప్రీతారెడ్డి ఎండీగా ఉన్నారు. సంగీత జాయింట్ ఎండీ కాగా, సునీత, శోభన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ లుగా పనిచేస్తున్నారు. వీరంతా సమన్వయంగా విజయవంతంగా నడిపిస్తున్నారు. 

ఇక ప్రతాప్ రెడ్డికి 10 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. 9 మందిని ఇప్పటికే అపోలోలో భాగం చేశారు. తన వ్యాపారాన్ని మూడో తరానికి బదిలీ చేసే ప్రక్రియను ఇప్పుడు ప్రతాప్ రెడ్డి చూస్తున్నారు. అపోలో హాస్సిటల్స్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.71,000 కోట్లు. అందులో ప్రమోటర్ల కుటుంబానికి 29.3 శాతం వాటా ఉంది. సుమారు రూ.20వేల కోట్లకు పైనే సంపదకు ప్రతాప్ రెడ్డి అధినేత కావడం గమనార్హం. ఎంతో మంది యువకులకే కాదు, వృద్ధులకూ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు.
Prathap C Reddy
Apollo Hospitals Enterprises
active role

More Telugu News