glycimic index: ఈ ఆహార పదార్థాలతో ఆరోగ్యం.. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ
- జీఐ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో ఆరోగ్య ఫలితాలు
- వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం, అనారోగ్యం నుంచి రక్షణ
- చిక్కుడు జాతి, క్వినోవా, నట్స్, బ్లూబెర్రీ, యుగర్ట్ మంచి ఎంపిక
గ్లైసిమిక్ ఇండెక్స్ ను (జీఐ) ఫుడ్ రేటింగ్ సిస్టమ్ గా చెబుతారు. ఆహార పదార్థాల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ పరిమాణం ఆధారంగా వాటికి జీఐ రేటింగ్ ఇస్తారు. పదార్థాన్ని తీసుకున్న తర్వాత అందులోని కార్బోహైడ్రేట్స్ రక్తంలో గ్లూకోజ్ ను ఎంత మేర పెంచుతాయనేది దీని ఆధారంగా తెలుసుకోవచ్చు. అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలను తిన్నప్పుడు.. అధిక పరిమాణంలో గ్లూకోజ్ వేగంగా రక్తంలోకి విడుదల అవుతుంది. ఇలాంటి ఆహార పదార్థాలతో బ్లడ్ షుగర్ (డయాబెటిస్) ముప్పు ఏర్పడుతుంది. అంతేకాదు, మరెన్నో అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది. తక్కువ జీఐ ఉన్నవి తీసుకోవడం వల్ల గ్లూకోజ్ రక్తంలోకి నిదానంగా విడుదల అవుతుంది. దీంతో శక్తి స్థిరంగా ఉంటుంది. బరువు పెరగరు. తక్కువ జీఐ ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల మధుమేహం నుంచి రక్షణ కల్పించుకోవచ్చు.
* అన్నింటిలోకి క్వినోవా మంచి ఎంపిక అవుతుంది. ఇది కూడా మన బియ్యం, గోధుమ మాదిరి ఒక రకమైన ధాన్యం. అతి తక్కువ జీఐ ఉంటుంది. పైగా కావాల్సిన కనీస పోషకాలు లభిస్తాయి. బరువు, మధుమేహం పెరగకూడదని భావించే వారు దీన్ని రోజువారీ తీసుకోవచ్చు.
* చిక్కుడు జాతి గింజ ధాన్యాలు కూడా మంచి ఎంపిక అవుతాయి. పెసలు, రాజ్మా, బొబ్బర్లు, సోయా తదితర వాటిల్లో జీఐ చాలా తక్కువ. ఫైబర్ చాలా ఎక్కువ. శక్తి క్రమంగా విడుదల కావడంతోపాటు, విటమిన్లు, పోషకాలు వీటి నుంచి లభిస్తాయి.
* ఇక ఆకుకూరలు కూడా జీఐ తక్కువగా ఉన్నవే. పాలకూర, కాలే, బచ్చలి కూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో మంచి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
* నట్స్, సీడ్స్ ను కూడా తీసుకోవచ్చు. బాదం గింజలు, వాల్ నట్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పీచు, ప్రొటీన్ లభిస్తాయి.
* స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ కొంచెం ఖరీదైనవి. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే వీటిని కూడా తరచూ తీసుకోవడం మంచిది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు దండిగా ఉంటాయి. బ్లూబెర్రీ దీర్ఘారోగ్యానికి మంచి ఆహారమని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి.
* పెరుగు, యుగర్ట్ ప్రాసెస్ వేరు. కనుక యుగర్ట్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు. ఇందులో ప్రొటీన్ దండిగా ఉంటుంది. సాధారణ పెరుగుతో పోలిస్తే యుగర్ట్ లో జీఐ తక్కువ. ప్రోబయోటిక్స్ పుష్కలంగా లభిస్తుంది.
* చిలగడదుంపని చాలా మంది ఇష్టపడతారు. మన దగ్గర కాల్చుకుని లేదా ఉడకబెట్టుకొని తింటారు. సాంబారులో వేసుకుని తీసుకుంటారు. వీటితో పీచు, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. వీటికి తోడు ముడి ధాన్యాలు, అవకాడోలోనూ జీఐ తక్కువ. స్కిన్ లెస్ చికెన్, టర్కీ, చేపలు, టోఫులోనూ ప్రొటీన్ ఉంటుంది. పైగా జీఐ తక్కువ.