K Kavitha: స్వతంత్ర భారతంలో కేసీఆర్ సరికొత్త రికార్డ్!: ఎమ్మెల్సీ కవిత
- మహిళా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్సీ
- ఆడబిడ్డల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి
- స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని కితాబు
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆడబిడ్డలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ, దేశానికే స్ఫూర్తిగా నిలిచారన్నారు.
కళ్యాణలక్ష్మితో ఇంటి పెద్దలా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌తో ఇంటి డాక్టర్లా, కేసీఆర్ కిట్‌తో మేనమామలా, అమ్మఒడితో సంరక్షకుడిలా, ఆరోగ్యలక్ష్మితో ఆరోగ్య దాతగా, షీ టీమ్‌లతో రక్షకుడిగా కేసీఆర్ అండగా నిలిచారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థల్లో భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇంటింటికి సురక్షిత నీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథను తీసుకువచ్చారని చెప్పారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచారన్నారు.
గత తొమ్మిదేళ్లలో 13,90,636 మంది బాలింతలు కేసీఆర్ కిట్ ద్వారా లబ్ది పొందారన్నారు. 6.84 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, 18,46,635 మంది మహిళలకు అమ్మ ఒడి పథకం అందించారన్నారు. స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళా సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు.