Kishan Reddy: అవినీతి, పైరవీలకు అతీతంగా ఉపాధి కల్పించడమే ప్రధాని లక్ష్యం: కిషన్ రెడ్డి
- దేశానికి సేవ చేసే భాగ్యాన్ని నిరుద్యోగులకు మోదీ కల్పిస్తున్నారన్న కిషన్ రెడ్డి
- అనేక సమస్యలను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమని వ్యాఖ్య
- ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాల అందజేత
అవినీతి, అక్రమాలకు, పైరవీలకు అతీతంగా ఉపాధి కల్పించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశానికి సేవ చేసే భాగ్యాన్ని నిరుద్యోగులకు మోదీ కల్పిస్తున్నారని చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ దోమల్ గూడలోని పింగళి వెంకటరామిరెడ్డి మందిరంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించారు.
తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం సులభమని, కానీ అనేక సమస్యలను అధిగమించి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమని అన్నారు. రోజ్ గార్ మేళా ఈ రోజులా ప్రతినెల కొనసాగుతుందని, ప్రతి నిరుద్యోగితో తానే స్వయంగా మాట్లాడి ఉద్యోగ కల్పన కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.