Texas: సముద్ర తీరం నిండా చచ్చిన చేపలే.. వీడియో వైరల్!
- అమెరికాలోని టెక్సాస్ గల్ఫ్ తీరానికి కొట్టుకొచ్చిన చేపలు
- ఎండల కారణంగా పెరిగిపోతున్న సముద్ర ఉష్ణోగ్రతలు
- సరిపడా ఆక్సిజన్ అందక చనిపోతున్న చేపలు
అమెరికాలోని టెక్సాస్ గల్ఫ్ తీరానికి లక్షల సంఖ్యలో మెన్‌హడెన్ జాతికి చెందిన చేపలు కొట్టుకొచ్చాయి. తరం వెంబడి ఎటు చూసినా చేపలు చనిపోయి తేలుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎండల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, దీంతో సరిపడా ఆక్సిజన్ అందక చేపలు మృతి చెందుతున్నాయని అధికారులు తెలిపారు. నీటి ఉష్ణోగ్రత 70 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువైతే మెన్‌హడెన్ లాంటి చేపలు మనుగడ సాగించలేవని క్వింటానా బీచ్ కౌంటీ పార్క్ అధికారులు వెల్లడించారు.
‘‘మీరు నీటిని వేడి చేసినప్పుడు.. నీటిలోంచి ఆక్సిజన్ గాలిలోకి విడుదల అవుతుంది. టెక్సాస్‌లో అదే జరిగింది. ఇప్పుడు కనుచూపు మేరలో ఎటుచూసినా చనిపోయిన చేపలు ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా స్పందించాలి’’ అని క్లైమేట్ డిఫయన్స్ అనే యూజర్ రాసుకొచ్చారు.