BRS: బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ బలోపేతానికి పని చేయాలి: కేటీఆర్
- హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
- 16న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం ప్రారంభమవుతుందని వెల్లడి
- పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తితో వార్డు కార్యాలయాలు ఏర్పాటు అన్న కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేస్తోన్న కృషిని గ్రేటర్ పరిధిలో ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కార్పొరేటర్లకు సూచించారు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ నెల 16న ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంతో సుపరిపాలన మరింత బలోపేతమవుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తితో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వార్డు కార్యాలయ వ్యవస్థను కార్పొరేటర్లు విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలన్నారు.