Gautam Gambhir: పీఆర్ ఏజెన్సీల ప్రచారం వల్లే ధోనీ హీరో అయ్యాడు: గంభీర్
- 2007, 2011 ఐసీసీ ప్రపంచకప్ లలో టీమిండియా విజయం
- ఆ రెండు పర్యాయాలు ధోనీనే కెప్టెన్
- ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమి
- ఐసీసీ టోర్నీలు నెగ్గడం ధోనీకే సాధ్యమంటూ పోస్టులు
- పీఆర్ ఏజెన్సీల ప్రచారం వల్లే ధోనీకి పేరు వచ్చిందన్న గంభీర్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాలాకాలం అయినప్పటికీ, ఐపీఎల్ రూపంలో అతడి ప్రాభవం కొనసాగుతోంది. ఇటీవల వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన అనంతరం ధోనీ పేరు మళ్లీ చర్చకు వచ్చింది.
ధోనీ నాయకత్వంలో భారత జట్టు ఐసీసీ ఈవెంట్లు నెగ్గిందని, ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు ధోనీ నాయకత్వం వహించి ఉంటే విజయం మనకే దక్కేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐసీసీ టోర్నీలు నెగ్గాలంటే ధోనీకే సాధ్యం అన్నట్టు పోస్టులు దర్శనమిస్తున్నాయి.
దీనిపై భారత మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. 2007, 2011 వరల్డ్ కప్ ఈవెంట్లలో భారత్ గెలిచిందంటే అందుకు కారణం అందరూ కలసికట్టుగా కృషి చేయడం వల్లేనని స్పష్టం చేశారు. కానీ, పీఆర్ ఏజెన్సీల ప్రచారం వల్ల అప్పటి కెప్టెన్ ధోనీకే గెలుపు క్రెడిట్ దక్కిందని వెల్లడించాడు.
2007లో టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలవడంలో యువరాజ్ సింగ్ కృషి ఉందని... ఆ రెండు టోర్నీల్లో యువరాజ్ సింగ్ ఆటతీరు వల్లే భారత్ ఫైనల్ చేరిందని గంభీర్ వివరించాడు. కానీ, పీఆర్ ఏజెన్సీలు గట్టిగా ప్రచారం చేసి ధోనీని హీరోను చేశాయని అన్నాడు.
ఇతర జట్లు సమష్టి కృషికి పెద్దపీట వేస్తాయని, కానీ మనం మాత్రం వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తూ జట్టు ప్రదర్శనను పట్టించుకోమని విమర్శించాడు.