Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌ను కుదిపేసిన వరుస భూకంపాలు.. భయంతో హడలిపోయిన జనం

3 earthquakes jolt Jammu and Kashmir

  • నిన్న 5.4 తీవ్రతతో భూకంపం
  • దెబ్బతిన్న పలు భవనాలు.. ఐదుగురికి గాయాలు
  • అంతలోనే మరో మూడు భూకంపాలు
  • ఢిల్లీ, ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్థాన్‌లోనూ ప్రకంపనలు

వరుస భూకంపాలతో జమ్మూకశ్మీర్‌లోని కత్రా, దోడా ప్రాంతాలు ఊగిపోయాయి. ఈ తెల్లవారుజామున సంభవించిన మూడు భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నిన్న 5.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఐదుగురు గాయపడ్డారు. ఆ భయం నుంచి జనం ఇంకా కోలుకోకముందే ఈ తెల్లవారుజామున మరో మూడు భూకంపాలు భయపెట్టాయి. 

తెల్లవారుజామున 2.20 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో తొలి భూకంపం సంభవించినట్టు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఉదయం 7.56 గంటలకు 3.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా భూమికి 10 కిలోమీటర్ల లోతున ఉండగా, 8.29 గంటలకు 3.3 తీవ్రతతో మూడో భూకంపం భయపెట్టింది. దీని భూకంప కేంద్రం కిష్త్వార్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతున ఉంది. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలతోపాటు పాకిస్థాన్‌లోనూ ప్రకంపనలు కనిపించాయి. ప్రకంపనలతో భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లో గడిపారు.

  • Loading...

More Telugu News