dmk: ఈడీ విచారణ... ఛాతినొప్పి తట్టుకోలేక ఏడ్చేసిన తమిళనాడు మంత్రి: బీజేపీపై ఖర్గే మండిపాటు
- మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ అనంతరం హైడ్రామా
- మంత్రికి బైపాస్ సర్జరీ చేయాలన్న డాక్టర్లు
- బీజేపీకి భయపడేది లేదన్న స్టాలిన్, ఖర్గే
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డీఎంకే నేత సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అనంతరం హైడ్రామా కొనసాగుతోంది. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకు వచ్చే సమయంలో ఛాతి నొప్పిని తట్టుకోలేక మంత్రి ఏడ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు.
సెంథిల్ బాలాజీ అరెస్ట్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిలో మంత్రిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ... విచారణకు సహకరిస్తానని సెంథిల్ చెప్పినప్పటికీ, ఛాతి నొప్పి వచ్చే వరకు విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
సెంథిల్ అరెస్ట్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... బీజేపీ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తమను వ్యతిరేకించిన వారిపై మోదీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇలాంటి అకతాయి చేష్టలకు భయపడేది లేదన్నారు. బాలాజీ అరెస్ట్ ను ఖండిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.