Nara Lokesh: విత్తనం దగ్గర నుండి గిట్టుబాటు ధర ఇచ్చే వరకూ బాధ్యత తీసుకుంటాం: రైతులతో లోకేశ్
- నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
- జగన్ రైతులు లేని రాజ్యం తెచ్చాడని ఆగ్రహం
- రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే నంబర్ 3 గా ఉందన్న లోకేశ్
- రైతుపై ఉన్న తలసరి అప్పులో ఏపీని జగన్ నెంబర్ 1 చేశాడని వ్యాఖ్య
జగన్ రాష్ట్రంలో రైతులు లేని రాజ్యాన్ని తీసుకు వచ్చాడని, రైతు ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 3వ స్థానంలో ఉందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో నిప్పులు చెరిగారు. ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ హయాంలో ఒకే సంతకంతో 50 వేల లోపు ఉన్న రుణాలు అన్నీ మాఫీ చేసినట్లు చెప్పారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్నీ సబ్సిడీలో అందించామని, ఉపాధి హామీ పథకాన్ని లింక్ చేసి పంట కుంటలు తవ్వామన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామని తెలిపారు. రైతు రథాలు, ఎన్టీఆర్ జలసిరి కింద బోర్ వేసి సోలార్ పంపు సెట్లు, సూక్ష్మ పోషకాలు ఇచ్చామన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు.
వైసీపీ పాలనలో మొదటి రెండేళ్లు నెల్లూరు జిల్లాకి చెందిన అనిల్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, కానీ ఇక్కడ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదన్నారు. నెల్లూరు జిల్లాకి ఆయన తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారని, కానీ సొంత జిల్లాలో అకాల వర్షాలతో రైతులు నష్టపోతే వారిని ఆదుకోవాలనే ఆలోచన కూడా కోర్టు దొంగకి రాలేదన్నారు. ఆయన సీబీఐ కేసులో బిజీగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. కాకాణి కోర్టులోనే ఫైల్స్ దొంగతనం చేశారన్నారు.
జగన్ పాలనలో భూసార పరీక్షా కేంద్రాలకు కరెంట్ బిల్లులు చెల్లించక మూతబడ్డాయని, ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 500 బోర్లు వేస్తానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల ప్రాజెక్టు పూర్తి చేసి ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని, పిల్ల కాలువలు కూడా పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తామన్నారు. హార్టికల్చర్ ని టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించామని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక కనీస సహకారం ఇవ్వడం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హార్టికల్చర్ పంటల వారీగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కువ రకాలు సాగు చేసేలా రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. ప్రతి పంటకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే మొక్కలు అందిస్తామన్నారు.
మామిడి, అరటి, దానిమ్మ, కర్జూరం, బొప్పాయి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేలా కంపెనీలతో ఒప్పందం చేసుకొని రైతులను ఆదుకుంటామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తనం దగ్గర నుండి గిట్టుబాటు ధర ఇచ్చే వరకూ బాధ్యత తీసుకుంటామన్నారు. పల్పింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ పాలనలో రైతులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి రూ.7,500 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. జగన్ పని అయిపోయిందని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కారణంగా నష్టపోతున్నారన్నారు. కల్తీ విత్తనాలు వైసీపీ నాయకులే సరఫరా చేస్తున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిర్చి రైతులు పెట్టుబడి పెరగడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు సబ్సిడీలో అందిస్తామని, మిర్చి అమ్ముకోవడానికి లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు వెళ్లి అమ్ముకోవాల్సిన కష్టాలు తొలగిస్తామని, నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు అమ్మకుండా ప్రత్యేక చట్టం తీసుకు వస్తామన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేస్తేనే రాష్ట్రంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు. ఒక అవగాహన లేని వ్యక్తి సీఎం అయితే ఎంత ప్రమాదమో రాష్ట్రంలోని ప్రాజెక్టులు చూస్తే అర్దం అవుతుందన్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. జగన్ రైతుల అప్పుల్లో ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చాడని దుయ్యబట్టారు.
పొగాకు రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, పెట్టుబడి పెరిగి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అంతర్జాతీయస్థాయిలో పొగాకు రేటు బాగున్నా ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతులని ఆదుకుంటామని, మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. వైసీపీ పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, గతంలో రూ.20 వేలు పెట్టుబడి అయితే ఇప్పుడు రూ.40 వేలు అవుతుందన్నారు. కనీసం ఎంత ధాన్యం కొంటారో చెప్పలేని దుస్థితి నెలకొందన్నారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కుంభకోణం రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. వరి రైతులని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకుంటామని, సకాలంలో డబ్బులు వేస్తామన్నారు.