Greece: వలసదారులతో వెళ్తున్న పడవ మునక.. 79 మంది జల సమాధి
- పడవలో సామర్థ్యానికి మించి వసలదారులు
- బాధితులు పాకిస్థాన్, ఈజిప్ట్, సిరియాకు చెందిన వారిగా గుర్తింపు
- పడవలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యపై లేని స్పష్టత
- వందలాదిమంది గల్లంతు
వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 79 మంది జల సమాధి కాగా, వందలాదిమంది మునిగిపోయి గల్లంతయ్యారు. గ్రీస్ తీరంలో జరిగిన ఈ ఘటన ఇటీవలి కాలంలో ఐరోపాలో జరిగిన ఘోర విపత్తులలో ఒకటిగా మిగిలిపోనుంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. యూరోపియన్ రెస్క్యూ సపోర్ట్ చారిటీ ప్రకారం పడవలో సామర్థ్యానికి మించి 750 మంది ప్రయాణిస్తున్నారు. అయితే, ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ ఏజెన్సీ మాత్రం ఆ సంఖ్యను 400గా చెబుతోంది.
లిబియా నుంచి బయలుదేరిన పడవ మార్గమధ్యంలో మునిగిపోగా 104 మందిని రక్షించారు. వలసదారుల్లో చాలామంది ఈజిప్ట్, సిరియా, పాకిస్థాన్‌కు చెందినవారిగా తెలుస్తోంది. ప్రమాదం నుంచి రక్షించిన వారిని పైలోస్‌లోని గ్రీక్ ఓడరేవు కలమటకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడే వారికి తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీలోని కలాబ్రియన్ తీరంలో ఓ పడవ తుపాను కారణంగా రాళ్లను ఢీకొట్టడంతో మునిగిపోయి 96 మంది ప్రాణాలు కోల్పోయారు.