Nara Lokesh: దోపిడీ, నటనలో జగన్ని మించిపోయాడు కరకట్ట కమల్ హాసన్: నారా లోకేశ్
- ఎమ్మెల్యే ఆర్కేపై లోకేశ్ తీవ్ర విమర్శలు
- మంగళగిరిని మోసం చేసిన మోసగాడు అంటూ ఆరోపణ
- టీడీపీ అధికారంలోకి రాగానే యూ1 జోన్ రద్దు చేస్తామని హామీ
అధికార వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిని మోసం చేసిన మోసగాడని ఆరోపించారు. దోపిడీలో, నటనలో సీఎం జగన్ను కరకట్ట కమల్ హాసన్ మించిపోయారంటూ ఎద్దేవా చేశారు.
‘మంగళగిరిని మోసం చేసిన మోసగాడు ఆర్కే. దోపిడిలో జగన్ ని మించిపోయాడు. నాలుగేళ్ల లో సహజ వనరుల దోపిడి ద్వారా వందల కోట్లు కొట్టేసాడు. రెండు సార్లు గెలిపించిన నియోజకవర్గానికి మేలు చెయ్యకపోగా ఉన్న సహజ వనరులు యథేచ్ఛగా దోచుకుంటున్నాడు. ఉండవల్లి కొండకి గుండు కొట్టాడు. కాజా చెరువులో మట్టి దోపిడి, గిరి ప్రదక్షణ పేరుతో మట్టి దోపిడి. ఇప్పుడు ఏకంగా నీరుకొండ క్వారీ వాటాల్లో తేడా వచ్చి వైసీపీ నాయకులు నడి రోడ్డు మీద తలలు పగలుగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ఆర్కే దోపిడి, దౌర్జన్యాలకు అడ్డాగా మార్చేశారు’ అని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూ1 జోన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ‘మాట మార్చుడు, మడమ తిప్పుడు లో జగన్ ని మించిపోయాడు కరకట్ట కమల్ హాసన్. ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా యూ1 జోన్ రద్దు చేస్తున్నాం అంటూ హామీ ఇచ్చి తాడేపల్లి రైతుల్ని మోసం చేసింది జగన్ ప్రభుత్వం. రైతులు ఆందోళన పడొద్దు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా యూ1 జోన్ రద్దు చేస్తాం. ఈ లోపు తొందర పడి డబ్బులు కట్టొద్దు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.