Ravichandran Ashwin: తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో గమ్మత్తు.. రివ్యూనే రివ్యూ కోరిన అశ్విన్!
- దిండిగల్ డ్రాగన్స్, బాల్సీ ట్రిచీ జట్ల మధ్య మ్యాచ్
- ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ఔట్ ను.. డీఆర్ఎస్ కోరిన బ్యాట్స్ మన్
- రివ్యూ తర్వాత నాటౌట్ గా ప్రకటించిన థర్డ్ అంపైర్
- ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మళ్లీ డీఆర్ఎస్ కోరిన బౌలర్ అశ్విన్
ఐపీఎల్ ముగియగానే.. తమిళనాడులో క్రికెట్ టోర్నమెంట్ మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ జోరుగా జరుగుతోంది. అయితే బుధవారం రాత్రి దిండిగల్ డ్రాగన్స్, బాల్సీ ట్రిచీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గమ్మత్తు ఘటన చోటుచేసుకుంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. థర్డ్ అంపైర్ రివ్యూని సవాలు చేస్తూ రివ్యూ కోరడం చర్చనీయాంశమైంది.
కోయంబత్తూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ట్రిచీ బ్యాటర్ రాజ్‌కుమార్ కు అశ్విన్ బౌలింగ్ చేశాడు. ఓ భారీ షాట్‌కు రాజ్‌కుమార్ యత్నించగా.. బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. దీంతో బ్యాటర్ వెంటనే రివ్వ్యూ కోరాడు. బ్యాట్ వద్ద నుంచి బంతి వెళ్తున్న సమయంలో అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ ఉన్నా.. థర్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ప్రకటించాడు. బంతి బ్యాట్ ను దాటి వెళ్లిపోకముందే స్పైక్ రావడం, తర్వాత కూడా స్పైక్ కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించాడు. దీంతో రాజ్‌కుమార్ నాటౌట్ గా ప్రకటించారు.
థర్డ్ అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని అశ్విన్.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని డీఆర్ఎస్ ద్వారా సవాల్ చేశాడు. రివ్యూని రివ్యూ చేశాడు. దీంతో థర్డ్ అంపైర్ మరోసారి పరిశీలించాడు. బ్యాట్ గ్రౌండ్‌కు తగిలిన సమయంలోనే అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ కనిపించినట్లు స్పష్టం చేశాడు. బ్యాటర్ రాజ్‌కుమార్‌కు నాటౌట్ ఇవ్వడంతో అశ్విన్ నిరాశతో వెనుదిరిగి వెళ్లాడు. చివరకు అశ్విన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలవడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిచీ జట్టు.. 120 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చక్రవర్తి 3 వికెట్లు, అశ్విన్, సుబోథ్ భటి, శ్రవణ కుమార్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన డ్రాగన్స్.. 4 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. శివమ్ సింగ్ 46 పరుగులు చేశాడు.