Gold Lizards: పోలవరం అడవిలో కనిపించిన బంగారు బల్లి
- పాపికొండలు అభయారణ్యంలోని గుహల్లో కనిపిస్తున్న బంగారు బల్లులు
- 250 వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్న అధికారులు
- రాత్రిపూట మాత్రమే సంచరించే బంగారు బల్లులు
అంతరించిపోతున్న జీవ జాతుల్లో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి ఒకటి. ఇవి బంగారు వర్ణాన్ని పోలిన ముదురు పసుపు రంగులో ఉంటాయి. 15 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. సూర్యరశ్మి సోకని, చల్లని ప్రదేశాల్లో ఉంటాయి. రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. రాతి గుహలు, గుహల సందుల మధ్య ఉండే తేమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలో ఉన్న గుహల్లో కనిపిస్తున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఈ బల్లులు ఒకేసారి 40 నుంచి 150 వరకు గుడ్లను పెడతాయి. అయితే గుడ్లను పాములు, ఇతర క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాబితాలో చేరాయి.