Samantha: వ్యాధి నిర్ధారణ జరిగాక ఇదీ నా జీవితం: సమంత
- మయోసైటిస్ వ్యాధి బారినపడ్డ సమంత
- కోలుకుని మామూలు మనిషైన అందాల నటి
- ఇన్ స్టాగ్రామ్ లో సామ్ ఎమోషనల్ పోస్టు
టాలీవుడ్ అందాల నటి సమంత... నాగచైతన్యతో విడిపోయాక ఆరోగ్యపరంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారినపడ్డారు. కష్టసాధ్యమైన చికిత్సతో మళ్లీ మామూలు మనిషియ్యారు. దీనిపై సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఒక భావోద్వేగ పోస్టు పెట్టారు. మయోసైటిస్ కు గురయ్యాక తన జీవితంలో వచ్చిన మార్పులను ఈ సుదీర్ఘ పోస్టులో వివరించే ప్రయత్నం చేశారు.
"ఇప్పటికి వ్యాధి నిర్ధారణ జరిగి సంవత్సరం అయింది. దాంతో ఈ ఏడాది ఎప్పుడూ ఊహించని కొత్త పరిస్థితులు ఎదుర్కొన్నాను. నా శరీరంతోనే ఎన్నోసార్లు పోరాడాను. ఉప్పు లేదు, చక్కెర లేదు... మొత్తం పథ్యంతో కూడిన ఆహారమే. చెప్పాలంటే మందులే ఆహారం అయ్యాయి.
ఇష్టం లేకపోయినా కొన్ని మానేయడాలు, కొన్ని బలవంతంగా అలవాటు చేసుకోవడాలు... ఏమిటీ జీవితం, దేనికి ప్రతిఫలం ఇది అని ఆలోచించడం, ఎందుకిలా అని ఆత్మపరిశీలన చేసుకోవడంతోనే ఈ ఏడాది సరిపోయింది. నా వృత్తిలో వైఫల్యాలను కూడా తరచి చూసుకున్నాను.
మరింత ఆసక్తికరం ఏంటంటే... ఈ ఏడాది ఎప్పుడూ చేయనన్ని పూజలు పునస్కారాలు చేశాను. వరాలు, దీవెనల కోసం కాదు... శక్తిని ఇవ్వమని, ప్రశాంతను ఇవ్వమని ప్రార్థించాను. అన్నీ మనకు అనుకూలంగానే జరగవన్న విషయం ఈ ఏడాది నాకు నేర్పించింది.
ముఖ్యంగా, ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏంచేయాలో తెలిసింది. నా చేతుల్లో ఉన్నదైతే నేను కంట్రోల్ చేయగలను... నా చేతుల్లో లేని విషయం అయితే పోతే పోనీ అని వదిలేయడం అలవర్చుకున్నాను. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్లాలి... వెళుతూనే ఉండాలి. అది విజయాల కోసమే కానక్కర్లేదు... కొన్ని సందర్భాల్లో ముందడుగు వేయడమే విజయం.
ప్రతిదీ నూటికి నూరుశాతం సవ్యంగా జరగాలని ఎదురు చూస్తూ కూర్చోకూడదు.... గతాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. నన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తా... నన్ను ప్రభావితం చేసే శక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించను. మీలో కూడా చాలామంది జీవితంలో కష్టాల కడలిలో చిక్కుకుని పోరాడుతుంటారు... మీలాంటి వారి కోసం కూడా నేను ప్రార్థిస్తాను.
దేవుళ్లు కొన్నిసార్లు ఆలస్యం చేస్తారేమో కానీ, వారు ఎప్పుడూ మన చేతిని విడువరు. మీరు శాంతి, ప్రేమ, సంతోషం, శక్తిని కోరుకుంటే వారు ఎప్పుడూ కాదనరు. ఎలాంటి స్వార్థం లేని అంశాలు ఇవే కదా!" అంటూ సమంత వివరించారు.