Andhra Pradesh: బాబోయ్ ఎండలు.. ఉడికిపోతున్న ఏపీ!
- 200 మండలాల్లో వడగాలులు
- నర్సాపురంలో సాధారణం కంటే 7.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు
- నేడు, రేపు కూడా వడగాలుల జోరు
జూన్ నెలలో సగం రోజులు పూర్తయ్యాయి. అయినా భానుడి భగభగలు ఏమాత్రం తగ్గలేదు సరికదా, రోజురోజుకు తీవ్రత మరింత పెరుగుతోంది. సూరీడు నిన్న మరింతగా చెలరేగిపోయాడు. ఈ వేసవిలో ఎన్నడూ లేనంతగా నిన్న ఏకంగా 200 మండలాల్లో వడగాలులు వీచాయి. ఫలితంగా ప్రజలు అల్లాడిపోయారు. మరో 220 మండలాల్లోనూ వీటి తీవ్రత అధికంగా ఉన్నట్టు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
నిన్న నర్సాపురంలో సాధారణం కంటే 7.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. నేడు, రేపు కూడా వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నర్సాపురంలో 7.9, విశాఖ, బాపట్లలో 7.1, మచిలీపట్టణంలో 6.9, జంగమహేశ్వరపురంలో 6.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.