USA: కోడి ముందా? గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందోచ్..!
- జీవపరిణామక్రమంపై బ్రిస్టల్ యూనివర్సిటీ, నాన్జింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం
- మొదట్లో ఉభయచరాలు నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చిన అధ్యయనకారులు
- పరిస్థితులు అనుకూలించే వరకూ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని వెల్లడి
- ప్రస్తుతం కొన్ని జాతుల బల్లులు అప్పుడప్పుడూ నేరుగా పిల్లల్ని కంటాయని వెల్లడి
కోడి ముందా..గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం చెప్పారు. కోడే ముందని ఆధారాలతో సహా నిరూపించారు. జీవ పరిణామక్రమంపై ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశానికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సరీసృపాలు, పక్షులు, జంతువులు మొదలైనవి ప్రస్తుతం మనం చూస్తున్న రూపం సంతరించుకోక మునుపు నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు. 51 శిలాజాలు, ప్రస్తుతం జీవించి ఉన్న 29 జంతుజాతుల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇవి మొదట్లో తమ పునరుత్పత్తికి నీటిపైనే ఆధారపడేవని చెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితులు అనువుగా మారే వరకూ అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని చెప్పారు. ఆ తరువాత, నేలపై జీవనానికి అలవాటు పడే క్రమంలో గుడ్లు పెట్టడం ప్రారంభించాయని అన్నారు.
ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతుల బల్లులు అప్పుడప్పుడూ నేరుగా పిల్లలకు జన్మనిచ్చి తతిమా సందర్భాల్లో గుడ్లు పెడతాయని చెప్పారు. బ్రిస్టల్ యూనివర్సిటీ, నాన్జింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘ది జర్నల్ నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’లో ప్రచురితమయ్యాయి.