Eknath Shinde: దేవేంద్ర ఫడ్నవీస్‌తో విభేదాలు.. స్పందించిన ‘మహా’ సీఎం ఏక్‌నాథ్ షిండే
- ఫడ్నవీస్ కంటే షిండేకే జనారదరణ ఎక్కువంటూ యాడ్స్
- బీజేపీ-శివసేన (షిండే) మధ్య విభేదాలకు కారణమైన ప్రకటన
- తమ మధ్య విడదీయలేనంత బంధం ఉందన్న షిండే
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో విభేదాలున్నట్టు వస్తున్న వార్తలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరూ కలిసి గురువారం ఒకే హెలికాప్టర్‌లో పర్యటించారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరం కలిసి కూటమిని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఫడ్నవీస్ కంటే షిండేనే పాప్యులర్ వ్యక్తిగా చూపించేలా ఉన్న దినపత్రికల ప్రకటన తర్వాత శివసేన, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మంగళవారం పలు దినపత్రికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోతో ప్రకటనలు కనిపించాయి. పాప్యులారిటీ విషయంలో ఫడ్నవీస్ కంటే షిండే ముందున్నారని ఓ సర్వేను ఉటంకిస్తూ ఈ యాడ్స్ దర్శనమిచ్చాయి. ఇది బీజేపీ, షిండే శివసేన వర్గానికి మధ్య విభేదాలకు కారణమైంది. ఆ ప్రకటనలో ఫడ్నవీస్, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఫొటోలు లేవు.
పాల్ఘర్ జిల్లాలో నిన్న నిర్వహించిన షశాన్ అపల్య దరి (ప్రజల ముంగిటకు ప్రభుత్వం) కార్యక్రమంలో షిండే, ఫడ్నవీస్ కలిసి ఒకే హెలికాప్టర్‌లో వచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తమ రెండు పార్టీల మధ్య పొత్తు స్వార్థం కోసం, అధికారం కోసం కాదని, సిద్ధాంతం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. ఫడ్నవీస్‌తో తన స్నేహం కొత్తది కాదని, 15-20 ఏళ్ల పాతదని చెప్పారు. తమ మధ్య విడదీయలేనంతగా బంధం పెనవేసుకుపోయిందని అన్నారు. కొందరు తమ జోడీని ‘జై-వీరు’గా అభివర్ణిస్తారని చెప్పుకొచ్చారు.