YS Jagan: టిడ్కో గృహాలను ప్రారంభించిన జగన్.. హామీని నెరవేర్చామన్న సీఎం
- గుడివాడలో ఇచ్చిన హామీని అక్కడే నెరవేర్చామన్న సీఎం
- ఒక్కో ఇంటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని లెక్కలతో చెప్పిన జగన్
- ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు పేదోడికి సెంటుభూమి కూడా ఇవ్వలేదని ఎద్దేవా
- రెండు దశల్లో 21 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్న జగన్
కృష్ణా జిల్లా గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేశ్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే పేర్నినాని తదితరులు ఘన స్వాగతం పలికారు.
టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మిస్తున్నవి జగనన్న కాలనీలు కావని, ఊర్లని అన్నారు. వీటి నిర్మాణంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు. ఈ కాలనీల్లో 16,240 కుటుంబాలు నివసిస్తాయని పేర్కొన్నారు. గుడివాడలో ఇచ్చిన హామీని నిజం చేసి చూపించామన్నారు.
ఇంటి స్థలం విలువను రెండున్నర లక్షల రూపాయలు అనుకున్నా, ఇల్లు కట్టడానికి రూ. 2.70 లక్షలు ఖర్చు, మౌలిక సదుపాయల నిర్మాణానికి రూ. లక్ష ఖర్చు వేసుకున్నా ప్రతి ఇంటి విలువ దాదాపు రూ. 10 లక్షలు అవుతుందన్నారు. గుడివాడలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడని, పేదోడికి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా తాము 30.60 లక్షల పట్టాలు ఇచ్చామన్నారు. రెండు దశల్లో 21 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పుకొచ్చారు. రూ. 75 వేల కోట్ల ఆస్తులను పట్టాల రూపంలో ఇచ్చినట్టు సీఎం వివరించారు.