Lunch: తిండి విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
- మానవాళి ఆరోగ్యంపై తిండి అలవాట్ల ప్రభావం
- ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయంటున్న పరిశోధకులు
- మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన
మానవుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలలో తిండి అలవాట్లు కూడా ముఖ్యమైనవే. ఆహారపు అలవాట్లు వ్యక్తుల ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయని పరిశోధకులు అంటున్నారు. తిండి విషయంలో చేసే కొన్ని తప్పులు చిన్నవే అయినా దీర్ఘకాలంలో చేటు చేస్తాయని, ప్రమాదకర జబ్బులకు దారితీస్తాయని చెబుతున్నారు.
ఆహారం విషయంలో కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం...
- ఉదయం అల్పాహారం తినకుండా మధ్యాహ్న భోజనం పీకల దాకా లాగించడం
- తిన్నవెంటనే పనిచేయడం
- మంచినీరు తక్కువగా తీసుకోవడం
- పిచ్చిపట్టినట్టుగా తినడం
- నిర్దిష్ట సమయం అంటూ లేకుండా ఎప్పుడంటే అప్పుడు లంచ్ చేయడం.
- మధ్యాహ్న భోజన సమయంలో కనీసం స్నాక్స్ అయినా తీసుకోకపోవడం
- లంచ్ లో ఎప్పుడూ జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం
- మధ్యాహ్నం భోజనం చేయాల్సిన సమయంలో టీ, కాఫీలు తాగడం
- హడావిడిగా తినడం
- పోషక విలువలున్న ఆహారానికి లంచ్ లో చోటివ్వకపోవడం
- లంచ్ కు ఓ ప్రణాళిక అంటూ లేకపోవడం
- మధ్యాహ్న భోజనంలో సమతుల ఆహారం తీసుకోకపోవడం
ఈ అలవాట్లన్నీ అప్పటికప్పుడేమీ ప్రభావం చూపవు, కానీ నిదానంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మొదట్లో వీటి లక్షణాలు ఓ మోస్తరుగానే అనిపించినా, కాలక్రమంలో కోలుకోలేనంతగా నష్టం వాటిల్లుతుంది.
సరైన రీతిలో మధ్యాహ్న భోజనం చేయకపోతే శరీరం తగినంత మోతాదులో కీలక విటమిన్లను, ఖనిజలవణాలను స్వీకరించలేదు. అస్తవ్యస్త భోజన సమయాలు మొదట జీర్ణవ్యవస్థను నాశనం చేస్తాయి. దాంతో ఉదరంలో జీర్ణరసాల ఉత్పత్తిలో సమతుల్యత ఉండదు. మొదట్లో చిన్న సమస్యలే అనుకున్నవి ఆ తర్వాత తీవ్రస్థాయికి చేరతాయి.
ప్రధానంగా, సక్రమమైన తిండి అలవాట్లు లేకపోతే మధుమేహం బారినపడే ముప్పు ఎక్కువ. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, మధ్యాహ్న భోజనం వరకు పరగడుపునే ఉండడం శరీరంలో ఇన్సులిన్ స్థాయులను కుదుపులకు గురిచేస్తాయి. దాంతో బ్లడ్ సుగర్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది.
ఇక, కొన్ని రకాల ఆహార పదార్థాలు క్యాన్సర్ కు దారితీస్తాయి. ఒబేసిటీతో పాటు 13 రకాల క్యాన్సర్లకు అనారోగ్యకర ఆహారమే కారణమని పరిశోధకులు గుర్తించారు. మెనింజియోమా, థైరాయిడ్, అడెనోకార్సినోమా, ఈసోఫేగస్, మల్టీపుల్ మైలోమా, కిడ్నీ, యూట్రస్, ఓవరీ, లివర్, గాల్ బ్లాడర్, ఉదరం, ప్యాంక్రియాస్, బ్రెస్ట్ క్యాన్సర్ లకు అనారోగ్యకరమైన తిండికి సంబంధం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
మధ్యాహ్న భోజనంలో బలమైన పోషకాహారం తీసుకోకపోతే గుండె బలహీనపడుతుంది. అదే సమయంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు మోతాదు మించరాదు. ప్రతిరోజు పెద్దవాళ్లు 2,300 ఎంజీ కంటే ఎక్కువ ఉప్పు తీసుకోరాదు. అయితే ప్రస్తుతకాలంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్ రూపంలో మనకు తెలియకుండానే ఉప్పు అధికంగా తీసుకుంటున్నాం. ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సోడియం వినియోగాన్ని నియంత్రించవచ్చు.