Indian Railways: రైలు ప్రయాణంలో చోరీ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- రైలులో ఢిల్లీ వెళ్తుండగా రూ. లక్ష చోరీ
- రైల్వే నుంచి డబ్బులు ఇప్పించాలంటూ కేసు
- అనుకూలంగా తీర్పు చెప్పిన వినియోగదారుల ఫోరాలు
- రైలులో చోరీకి రైల్వే శాఖ బాధ్యత వహించదన్న సుప్రీంకోర్టు
ప్రయాణంలో జరిగిన దొంగతనానికి రైల్వే శాఖ బాధ్యత వహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రయాణికుడు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రయాణంలో జరిగే చోరీ రైల్వే సేవల లోపం కిందికి రాదని పేర్కొన్న ధర్మాసనం.. అంతకుముందు వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేందర్ భోళా అనే వ్యాపారి 2005లో కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్తుండగా లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రైలులో చోరీ జరిగింది కాబట్టి ఆ మొత్తాన్ని రైల్వే నుంచి ఇప్పించాలని కోరుతూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. అక్కడాయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
వినియోగదారుల ఫోరం తీర్పును స్టేషన్ సూపరింటెండెంట్ సవాలు చేయగా రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు కూడా తోసిపుచ్చాయి. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన తీర్పులను తప్పుబట్టింది. ప్రయాణంలో చోరీ రైల్వే సేవల లోపం కిందికి వస్తుందని అవి ఎలా చెప్పాయో అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేనప్పుడు దానికి రైల్వే శాఖను బాధ్యుల్ని చేయడం కుదరదని తేల్చి చెబుతూ వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది.