Bapatla District: బాపట్ల టెన్త్ కుర్రాడి సజీవ దహనం కేసులో అసలు విషయం బయటకు!
- తన సోదరిని వేధిస్తుండడంతో నిలదీసిన బాలుడు
- స్నేహితులతో కలిసి గతంలో రెండుసార్లు దాడి
- గ్రామ పెద్దలకు దాడి విషయం చెప్పడంతో కక్ష
- ట్యూషన్ నుంచి వస్తుండగా కొట్టి, కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి నిప్పు
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీలోని ఉప్పరపాలేనికి చెందిన పదో తరగతి విద్యార్థి ఉప్పల అమర్నాథ్ హత్య కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పట్లానే ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న కుర్రాడిని నిన్న ఉదయం దారికాచి అడ్డగించిన నలుగురు యువకులు పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వెంకటేశ్వర్‌రెడ్డి పేరును చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే మృతి చెందాడు. బాలుడ్ని అంత కిరాతకంగా ఎందుకు హత్య చేశారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాలుడు పేర్కొన్న వెంకటేశ్వర్‌రెడ్డి.. మృతుడు అమర్నాథ్ సోదరిని పలుమార్లు వేధించాడు. విషయం తెలిసిన అమర్నాథ్ రెండు నెలల క్రితం అతడిని నిలదీశాడు. ఇంకోసారి అలా చేస్తే బాగుండదని హెచ్చరించాడు. దీంతో బాలుడిపై కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి స్నేహితులతో కలిసి రెండుసార్లు బాలుడిపై దాడిచేశాడు. తనపై దాడి విషయాన్ని అమర్నాథ్.. వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో అమర్నాథ్‌పై మరింత కక్ష పెంచుకున్న నిందితుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నిన్న సైకిలుపై ట్యూషన్ నుంచి వస్తున్న బాలుడిని అడ్డగించి కొట్టాడు. ఆ తర్వాత కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి తగలబెట్టాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.