Andhra Pradesh: ‘వందేభారత్’లో పనిచేయని ఏసీలు.. ప్రయాణికులకు ఇక్కట్లు
- విశాఖపట్నం-సికింద్రాబాద్ (20833) వందేభారత్ రైల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు
- ఫలితంగా అయిదు గంటల ఆలస్యంగా మొదలైన ప్రయాణం
- ఆ తరువాత కొన్ని బోగీల్లో పనిచేయని ఏసీలు
- మరమ్మతుల కోసం మరికొంత సేపు నిలిచిపోయిన రైలు
- వరుస సమస్యలతో ప్రయాణికుల్లో తీవ్ర అసహనం
విశాఖపట్నం-సికింద్రాబాద్ (20833) వందేభారత్ రైల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా, ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రైలు ఐదుగంటల ఆలస్యంగా ఉదయం 10.45కు బయలుదేరింది. ఆ తరువాత కొన్ని బోగీల్లో ఏసీలు పనిచేయకపోవడంతో ప్యాసెంజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు బోగీల్లో మూసి ఉన్న కిటికీలు.. వెరసి ప్రయాణికులు ఉక్కపోత భరించలేక ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు రైల్వే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.
రైలు రాజమండ్రి స్టేషన్కు చేరుకున్నాక కొందరు టెక్నీషియన్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తరువాత మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ స్టేషన్లో ఏడీఆర్ఎం శ్రీకాంత్ పర్యవేక్షణలో సిబ్బంది మరోసారి రంగంలోకి దిగారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మరమ్మతు చేశారు. చివరకు సాయంత్రం 5.30 గంటలకు రైలు మళ్లీ విజయవాడ నుంచి బయలుదేరింది. అసలే అయిదు గంటలు ఆలస్యంగా మొదలైన ప్రయాణం, ఆపై ఏసీ పనిచేయకపోవడంతో ప్యాసెంజర్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు.