Telangana: మంత్రి మల్లారెడ్డిపై కేఎల్ఆర్ను పోటీకి దింపనున్న కాంగ్రెస్?
- వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్
- నగర శివార్లలో మూడు స్థానాలపై కేఎల్ఆర్ ఫోకస్!
- మల్లారెడ్డి లేదంటే సబితా ఇంద్రారెడ్డిపై పోటీకి సిద్ధం
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కు తమ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి అనే భావనను కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అన్ని నియోజకవర్గాల్లో దీటైన అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ముఖ్యనేతలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో బలమైన నేతలుగా ఉన్న మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని దీటుగా ఎదుర్కోవడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ ముగ్గురికి దీటైన ప్రత్యర్థిగా, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి పట్టున్న సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. హై కమాండ్ ఆదేశాలతో ఆయన ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మేడ్చల్ నియోజక వర్గంలో బరిలోకి దిగి మంత్రి మల్లారెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వలస వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన తాండూరులో ఆయనతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పోటీకి సైతం కేఎల్ఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది.