Kanna Lakshminarayana: అంతా బాగుందని డీజీపీ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు: కన్నా
- జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్న కన్నా
- అవినీతి అరాచకాలకు కాపలా కాస్తున్నారని విమర్శలు
- శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు పట్టడంలేదని ఆగ్రహం
జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని, ప్రభుత్వ, పాలకుల అక్రమాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీకి కాపలా కాయడమే పోలీసుల పనిగా మారిందని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ అనేవి పోలీస్ విభాగానికి అసలు పట్టడంలేదని ఆరోపించారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కన్నా విలేకరులతో మాట్లాడారు. అవినీతిని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెడుతూ... వైసీపీ నేతలు, కార్యకర్తల రక్షణే తమ విధి నిర్వహణ అన్నట్టుగా రాష్ట్ర పోలీస్ శాఖ వారికి కంచెలా కాపలా కాస్తోందని మండిపడ్డారు.
"విశాఖపట్నంలో సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ పనితీరుకి నిదర్శనం. సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కాపాడలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ముఖ్యమంత్రే అక్రమాలు, దోపిడీలు పెంచి పోషిస్తూ, మాఫియాడాన్ లా తయారవ్వడం నిజంగా దురదృష్టకరం.
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో తన సోదరిని ఏడిపించినవారిని ప్రశ్నించినందుకు పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలబెట్టడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం కాదా? మహిళలపై జరిగే అత్యాచారాలు, ఇతర దారుణాల్ని నిరోధించాల్సిన రాష్ట్ర హోంమంత్రే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడో ఒకటీ అరా జరగుతున్నాయంటూ, జరిగే దారుణాల్ని ఆమె తక్కువచేసి మాట్లాడటం ఎంతమాత్రం సరైంది కాదు.
గతంలో నేను విశాఖపట్నం ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు నగరంలోకి సంఘ విద్రోహశక్తులు ప్రవేశించాయని తెలియగానే, పోలీస్ శాఖను అప్రమత్తంచేసి, ఇద్దరు క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ చేయించాము.
డీజీపీ అంతా బాగుందని అనుకుంటే అంత కంటే మూర్ఖత్వం మరోటి లేదు. సత్తైనపల్లి డీఎస్పీపై ఫిర్యాదు చేయడానికి నేనే డీజీపీని కలుద్దామనుకుంటున్నాను. ప్రతిపక్ష నేతగా మేం ఎప్పుడు ఫోన్ చేసినా, సదరు డీఎస్పీ స్పందించడు.
ఇక, రాష్ట్ర సహకార రంగాన్ని వైసీపీ ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మార్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి వైసీపీ నేతల నుంచి ముఖ్యమంత్రి వరకు సహకారరంగంలో రూ.5 వేల కోట్లు కాజేశారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర సహకార రంగంలో జరిగే అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అలానే నాబార్డ్ ఛైర్మన్ కు కూడా ఫిర్యాదుచేశాను. అందరి కోసం పనిచేయాల్సిన సహకార వ్యవస్థలో జవాబుదారీతనం లేకుండా చేసి, జేబుదొంగలకు అప్పగించారు” అని కన్నా తెలిపారు.