Seediri Appalaraju: బిచ్చం అడిగినట్టు అడిగితే సీఎం పదవి వస్తుందా?: పవన్ పై మంత్రి సీదిరి అప్పలరాజు వ్యంగ్యం
- సీఎం కావాలని సంపూర్ణంగా కోరుకుంటున్నానన్న పవన్
- ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి
- సీఎం పదవి ప్రజలు ఇవ్వాలన్న మంత్రి సీదిరి
- ముష్టి అడిగితే రాదని ఎద్దేవా
ముఖ్యమంత్రిని అవ్వాలని పరిపూర్ణంగా కోరుకుంటున్నానని, ఒక్క చాన్స్ ఇవ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో ప్రతి సభలో విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యంగ్యం ప్రదర్శించారు. ఇలా బిచ్చం అడిగినట్టు అడిగితే ముఖ్యమంత్రి పదవి లభిస్తుందా? అని వ్యాఖ్యానించారు. సీఎం పదవి అనేది ప్రజలు ఇవ్వాలని, అంతే తప్ప ముష్టి అడిగితే రాదని ఎద్దేవా చేశారు.
ఎంతసేపటికీ, తాను ఎమ్మెల్యే కాకుండా ఎవరు ఆపుతారంటూ పవన్ పేర్కొంటున్నారని, ఇంతకీ ఆయన తిరుగుతోంది పార్టీ అభ్యర్థుల కోసమా, తన కోసమా...? అని మంత్రి సీదిరి సందేహం వ్యక్తం చేశారు. కనీసం పవన్ కు తాను ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై స్పష్టత ఉందా? అని నిలదీశారు.
లేస్తే చెప్పుల గురించి మాట్లాడుతున్న పవన్ ముందు తన పార్టీ గుర్తును చూసుకోవాలని హితవు పలికారు. చెప్పులు పోతే మళ్లీ తెచ్చుకోవచ్చని, కానీ పార్టీ గుర్తే పోతే ఎలా? అని వ్యాఖ్యానించారు. అసలు, జనసేన పార్టీకి సింబల్ ను ఈసీ తీసివేసిందన్న విషయం పవన్ తెలుసుకోవాలని, ఈ గుర్తును ఈసీ ఎవరికి కేటాయించిందో పవన్ వెతుక్కోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు.
గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగానే పనిచేశాయని, తెరవెనుక అంతా కలిసే సంసారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.