Chandrababu: డీప్ టెక్నాలజీస్ అంశంపై సదస్సు... GFST చైర్మన్ హోదాలో హాజరైన చంద్రబాబు
- హైదరాబాదులో GFST సదస్సు
- GFSTకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న చంద్రబాబు
- భారత్ ను ఆర్థికంగా అగ్రస్థానంలో నిలపడంపై నేటి సదస్సులో చర్చ
- హాజరైన వివిధ రంగాల ప్రముఖులు
హైదరాబాదులో GFST (Global Forum for Sustainable Transformation) ఆధ్వర్యంలో 'డీప్ టెక్నాలజీస్' అనే అంశంపై జరిగిన సదస్సులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ GFST నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కు చంద్రబాబు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులతో మూడేళ్ల క్రితం GFST ఏర్పాటు చేశారు.
పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలపై GFST కృషి చేస్తోంది. 2047 నాటికి 100 ఏళ్ల స్వాతంత్ర్య దేశంగా భారత దేశం... దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై GFST పనిచేస్తోంది.
ఈ క్రమంలో ఈ ఏడాది డీప్ టెక్నాలజీస్, లాజిస్టిక్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టార్లపై సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. భారత దేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి తీసురావాల్సిన పాలసీలు, టెక్నాలజీ పాత్రపై నేటి సదస్సులో చర్చించనున్నారు.