nia: అమెరికా, కెనడాలలోని భారత కాన్సులేట్ లపై దాడుల కేసుల దర్యాప్తు ఎన్ఐఏ చేతికి
- దేశవ్యతిరేక చర్యలకు పాల్పడిన ఖలిస్థాన్ అనుకూలురు
- అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ పై దాడి
- కెనడాలో దుశ్చర్య... లండన్ లో త్రివర్ణ పతాకానికి అగౌరవం
- తీవ్రంగా ఖండించిన భారత్... కేసు నమోదు చేసిన పోలీసులు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ అరెస్టుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వివిధ దేశాల్లోని ఖలిస్థాన్ అనుకూలురు దేశవ్యతిరేక చర్యలకు పాల్పడిన సంగతి విదితమే. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై పలువురు దుండగులు దాడికి దిగారు. కెనడాలోను దౌత్య కార్యాలయం వద్ద దుశ్చర్యలకు పాల్పడ్డారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం వంటి చట్టాల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై దాడి విషయంలో ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారికి భారత్ అప్పుడే తీవ్ర నిరసన తెలిపింది. కెనడా హైకమిషనర్ ను కూడా పిలిపించి వివరణ కోరింది. అమెరికాలో దాడి జరిగిన రోజునే లండన్ లో కూడా భారత రాయబార కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచారు. దీనినీ భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశీ మంత్రిత్వ శాఖ నివేదికల ఆధారంగా హోంశాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ ఘటనపై ఎన్ఐఏ ఇప్పటికే విచారణ చేస్తోంది.