New Delhi: ఆయనే బతికుంటే దేశవిభజన జరిగి ఉండేది కాదు: అజిత్ దోభాల్
- నేతాజీ సంస్మరణార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అజిత్ దోభాల్ ప్రసంగం
- సుభాష్ చంద్రబోస్ ధైర్యస్థైర్యాలు అసాధారణమని ప్రశంస
- తాము మెచ్చిన నాయకుడు బోస్ అని జిన్నా పేర్కొన్నట్టు వెల్లడి
దేశవిభజన నాటికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలో నేతాజీ సంస్మరణార్థం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నేతాజీ తన జీవితంలో అనేక సందర్భాల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారన్నారు.
‘‘నేను ఇక్కడ మంచి చెడుల గురించి మాట్లాడట్లేదు. కానీ, భారత్తో పాటూ ప్రపంచ చరిత్రలో పరిస్థితులకు ఎదురీదిన వారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మహాత్మా గాంధీని సైతం ప్రశ్నించగలిగిన ధైర్యసాహసాలు ఆయన సొంతం. ‘నేను బ్రిటీష్ వారితో పోరాడుతా, స్వాతంత్ర్యం కోసం అడుక్కోను. స్వాతంత్ర్యం నా హక్కు, అది నేను సాధించి తీరుతా’ అని నేతాజీ అనుకునేవారు. నేతాజీ జీవించి ఉంటే దేశవిభజన జరిగి ఉండేది కాదు. తాను మెచ్చిన ఒకే ఒక నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని జిన్నా అప్పట్లో అన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. తైవాన్లో విమానం కూలి ఆయన మరణించారనేది అనేక మంది అభిప్రాయం.