Fake Ice Cream Factory: రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ ముఠా గుట్టురట్టు
- ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్ ల తయారీ
- గ్రామాల్లో అమ్మకాలు జరుపుతున్న ముఠా
- కాటేదాన్ పరిశ్రమపై పోలీసుల దాడుల్లో బయటపడ్డ ముఠా నిర్వాకం
డబ్బు సంపాదనే ధ్యేయంగా పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఓ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్ లు తయారుచేస్తున్న విషయాన్ని బయటపెట్టారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ముఠా నిర్వాకాన్ని ప్రజలకు చూపించారు. కాటేదాన్ లోని ఐస్ క్రీమ్ పరిశ్రమపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. కంపెనీలో తయారు చేస్తున్న ఐస్ క్రీమ్ లు ప్రమాదకరమైనవని గుర్తించారు. ఐస్ క్రీమ్ ల తయారీలో వాడుతున్న రసాయనాలు ప్రమాదకరమైనవని, ఈ ఐస్ క్రీమ్ లు తింటే పిల్లలు అనారోగ్యాల బారిన పడతారని చెప్పారు. ఈ ముఠాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
ఈ ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ కానీ లేవని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఫ్యాక్టరీని నడుపుతున్నారని వివరించారు. అపరిశుభ్ర వాతావరణంలో, నాసిరకం పదార్థాలతో తయారు చేసిన ఐస్ క్రీమ్ లకు ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మార్కెట్లోకి పంపిస్తున్నారని తెలిపారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు.