Chicken: కొండెక్కిన కోడి... కేజీ చికెన్ ధర రూ.300కి పైనే!
- భారీగా పెరిగిన చికెన్ ధరలు
- కిలో స్కిన్ లెస్ రూ.340-రూ.360
- బోన్ లెస్ అయితే కిలో రూ.400
- వేసవిలో తగ్గిన కోళ్ల ఉత్పత్తి
- పెరిగిన దాణా ధరలు
- దాంతో చికెన్ ధరలకు రెక్కలు
నాన్ వెజ్ ప్రియులను చికెన్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కడ చూసినా చికెన్ కిలో రూ.300 పైనే పలుకుతోంది. స్కిన్ లెస్ అయితే కొన్నిచోట్ల రూ.360 వరకు ఉంది. బోన్ లెస్ అయితే రూ.400. కొండెక్కిన ధరలతో ప్రజలు చికెన్ జోలికి వెళ్లడం తగ్గించేశారు. ఆదివారం నాడు కూడా కోడిమాంసం అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.
మండుతున్న ఎండలతో కోళ్ల ఉత్పత్తి సహజంగానే కుంటుపడుతుంది. ఎండవేడిమికి కోళ్లు చనిపోతుంటాయి. వేసవిలో కోళ్లు మేత తక్కువగా తిని నీళ్లు ఎక్కువగా తాగుతుంటాయి. దాంతో కోళ్లు పెద్దగా బరువు పెరగవు.
దానికి తోడు కోళ్ల దాణాలో ఉపయోగించే మొక్కజొన్న రేటు కూడా పెరిగిపోయిందని పౌల్ట్రీ ఫాం యజమానులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, చికెన్ రేటు అమాంతం పెరిగిపోయింది. జూన్ చివరి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.